కోహ్లీనే అవమానిస్తారా?

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో మకుటంలేని మహారాజు విరాట్‌ కోహ్లీ. అశేష అభిమానగణంతో ఉపఖండ క్రికెట్‌కే ముఖ చిత్రంగా మారాడు. ఆటతోనే ఫ్యాన్స్‌ గుండెల్లో గుడికట్టుకున్న విరాట్‌ది శాసించే స్థాయే..! సారథ్యాన్ని వదులుకోవడం సహా ఏదైనా తనకు తానుగా నిర్ణయం తీసుకోవాల్సిందే తప్ప.. అతడికి వ్యతిరేకంగా ఎటువంటి సాహసం చేయలేరనేది అభిమానుల విశ్వాసం. కానీ, ఒక్క మెయిల్‌తోనే విరాట్‌ వన్డే కెప్టెన్సీకి బీసీసీఐ ఉద్వాసన పలకడం ఫ్యాన్స్‌కు ఏమాత్రం మింగుడుపడడం లేదు. నాయకుడిగా ఎన్నో రికార్డులు సృష్టించినా.. కేవలం ఐసీసీ ట్రోఫీ సాధించలేదనే సాకుతో అవమానకరంగా తప్పించడంపై భగ్గుమంటున్నారు. కొన్నేళ్ల క్రితం ఇంచుమించు ఇదే తరహా పరిస్థితులను ఎదుర్కొన్న సౌరవ్‌ గంగూలీ.. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండి కూడా కోహ్లీకి అండగా నిలవకపోవడాన్ని ఆక్షేపిస్తున్నారు!

గతంలో దాదాకు కూడా..

టీ20 కెప్టెన్సీని వదులుకొన్న కోహ్లీ.. వన్డే, టెస్ట్‌ల్లో సారథిగానే కొనసాగుతానని స్పష్టం చేశాడు. కానీ, బీసీసీఐ మాత్రం వైట్‌బాల్‌ కెప్టెన్సీని విభజించాలనే ఆలోచనలో లేదు. దీంతో కోహ్లీ వన్డే నాయకత్వం కూడా ఊడుతుందనే ఊహాగానాలకు తగ్గట్టుగానే అతడిపై వేటుపడింది. టీ20, వన్డే కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్‌ శర్మకు అప్పగిస్తున్నట్టు బోర్డు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తమ ఆరాధ్య ఆటగాడిని అంతగా చిన్నబుచ్చే విధంగా తప్పించడంపై సోషల్‌ మీడియా వేదికలుగా నిప్పులు చెరుగుతున్నారు. పదహారేళ్ల క్రితం కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌తో విభేదాలు, పేలవ ఫామ్‌ కారణంగా గంగూలీ కెప్టెన్సీతోపాటు ఏకంగా టీమ్‌లోనే చోటుకోల్పోవాల్సి వచ్చింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గంగూలీకి బోర్డు అండగా నిలవడంతో టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు కోహ్లీకి కూడా అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ‘బోర్డు కార్యదర్శి జైషాకు ఈ విషయాలపై పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. ఆటగాడిగా ఎంతో అనుభవం ఉన్న గంగూలీ.. కోహ్లీని ఇలా తప్పించడాన్ని ఎలా సమ్మతించాడ’ని ఓ వర్గం నిలదీస్తోంది. 

About amaravatinews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *